కారణం ఏంటంటే రాము కూడా అచ్చం తనలాగే ఉండటంతో ఇన్నేళ్ళు తన నానమ్మ చెప్పిన అతను ఇతనేనా అన్నట్టు చూస్తున్నాడు. రాము తమ వైపు తిరిగిన తరువాత అతన్ని చూసిన ఒబరాయ్ ఫ్యామిలీ కూడా ఆశ్చర్యంతో, ఆనందంతో అలాగే నోట మాట రాక రాము వైపు కన్నార్పకుండా చూస్తున్నారు. రేణుక కూడా ఆనందగా రాము వైపు చూసి నోట మాట రాక అలాగే చూస్తున్నది. గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా రాము, ఒబరాయ్ ఫ్యామిలీలో పెద్ద మనవడు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉండటంతో అలాగే ఏం జరగబోతుందా అని చూస్తున్నారు. అందరు ఎవరి ఆనందంలో వాళ్ళు, ఆశ్చర్యంలో వాళ్ళు ఉండగా మీడియా వాళ్ళు వెంటనే రాముని, మనవడిని కలిపి ఫోటోలు తీస్తూ, వాళ్ళిద్దరి ఫోటోలతో పాటు ఒబరాయ్ ఫ్యామిలీ ఫోటోలు టకటక తీస్తున్నారు. రాము వాళ్ళని చూసిన ఆనందం నుండి తేరుకుని రేణుక వైపు చూసి, “రేణూ……” అని పిలిచాడు. అప్పటి దాకా తాను చూస్తున్నది కలా నిజమా అన్న సందిగ్ధంలో ఉన్న ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడ్డి రాము వైపు చూసి చిన్నగా తడబడుతున్న అడుగులతో దగ్గరకు వచ్చి రాముని గట్టిగా వాటేసుకుని ఆనందంతో ఏడుస్తూ, “మా దగ్గరకు రావడానికి ఇన్నేళ్ళు పట్టిందా రాము…..నీ కోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా,” అన్నది. రాము కూడా రేణుక చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని ఆమె భుజం మీద తల పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అంతలో రేణుక పెద్ద కొడుకు రాము దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి, “నాన్నా…..” అంటూ పిలిచాడు. అతనితో పాటు చిన్న కొడుకు, కూతురు కూడా రాము దగ్గరకు వచ్చారు. రాము కూడా తన పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళకు కూడా పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉండటం చూసి ఆనందంగా వాళ్ళను కౌగిలించుకున్నాడు. అలా కొద్దిసేపు ఉన్న తరువాత అందరూ తేరుకున్నారు. రేణుక రాము వైపు ఆనందంగా చూస్తూ, “రాము….ఇక ఇంటికి వెళ్దాం పద,” అన్నది. దాంతో అందరు ఇంకా రెట్టించిన ఆనందంతో వినాయకుడికి హారతి ఇచ్చి ఇంటికి బయలుదేరారు. గుడి లోనుండి బయటకు వచ్చేంత వరకు రేణుక రాము చేతిని పట్టుకునే ఉన్నది. పూజ అయిపోయిన తరువాత అందరూ బయటకు వచ్చారు. డ్రైవర్లు వరసగా కార్లు తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఆపారు. రేణుక పెద్ద కొడుకు ముందుకు వచ్చి డ్రైవర్ చేతిలో ఉన్న కార్ కీస్ తీసుకుని రాము వైపు చూసి, “ఈ రోజు మేము మీతో కలిసి వస్తాము,” అంటూ మిగతా వాళ్ళ వైపు చూసి, “మీరందరూ వేరే కార్లలో వచ్చేయండి,” అంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. చిన్న కొడుకు వచ్చి కార్ బ్యాక్ సీట్ డోర్ తెరిచాడు….దాంతో రాము లోపల కూర్చున్నాడు. అతని పక్కనే రేణుక కూర్చున్నది…..రేణుక కూతురు ఇంకో వైపు వచ్చి డోర్ తీసుకుని రాము పక్కనే కూర్చున్నది. చిన్న కొడుకు ఫ్రంట్ డోర్ తీసుకుని తన అన్న పక్కనే కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి చూసారు….వెనక సీట్లో రాము మధ్యలో కూర్చుంటే తమ తల్లి, చెల్లెలు చెరొక వైపు కూర్చుని చెరో భుజం మీద తల పెట్టి పడుకున్నారు. రాము మొహంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అది చూసి పెద్ద కొడుకు కూడా ఆనందంగా కార్ స్టార్ట్ చేసి తమ బంగళా వైపు పోనిచ్చాడు. వాళ్ళ వెనకే మిగతా వాళ్ళు మూడు కార్లలో బయలుదేరారు…..అందరి కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అందరూ విల్లాకు వచ్చిన తరువాత కార్లు దిగి లోపలికి వచ్చారు. రాముని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి రేణుక అతని పక్కనే కూర్చున్నది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి రాముని, రేణుకని ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తున్నారు. అందరూ సోఫాల్లో కూర్చుని రాము వైపు ఏదో అపురూపమైన దాన్ని చూసినట్టు చూస్తున్నారు. అందరిలోకి ముందుగా రేణుక చిన్న కొడుకు భార్య రెండో కోడలు రాము వైపు చూసి, “మామయ్యా….అత్తయ్య చూస్తే 60 ఏళ్ళు ఉన్నాయి…..మీరు చూస్తే సంతూర్ సోప్ వాడినట్టు వయసు పెరక్కుండా 27 ఎళ్ళ దగ్గరే ఆగిపోయారు….ఇంతకాలం అత్తయ్య గారు మీ గురించి చెబుతుంటే ఏదో చెబుతున్నారులే అని నమ్మలేదు….కాని ఇప్పుడు మిమ్మల్ని చూసిన తరువాత చాలా ఆశ్చర్యంగా….నలభై ఏళ్ళ తరువాత తిరిగివచ్చినందుకు చాలా ఆనందగాను ఉన్నది….మీ పోలికలే మొత్తం అచ్చు గుద్దినట్టు నా కొడుక్కి వచ్చాయి…..దాంతో అత్తయ్య గారు నా కొడుకుని చాలా ప్రేమగా చూసుకుంటూ వాడిలోనే మిమ్మల్ని చూసుకుంటూ ఉండెవారు…..” అనది. ఆమె అలా అనడంతో ఆమె మొగుడు, “నీకు ఎప్పుడు ఏది మాట్లాడాలో అసలు తెలియదు….మెదలకుండా ఉండు,” అన్నాడు. ఆమె అమాయకత్వానికి రాము నవ్వుతూ, “చూడమ్మా…..నాకు ఇప్పుడు 27 ఏళ్ళే…..మీకు లెక్కలో యాభై ఏళ్ళు జరిగిపోయాయి….కాని నేను మాత్రం యాభై ఏళ్ళు కాలంలో వెనక్కు వెళ్ళి రేణుకని పెళ్ళి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్న తరువాత మళ్ళీ నా కాలానికి….అంటే ఏ రోజు అయితే కాలంలో వెనక్కు వెళ్ళి రేణుకను కలిసానో….మళ్ళీ అదే రోజు కాలంలో నా కాలంలోకి వచ్చేసాను…..అందుకని నా వయసు 27 దగ్గరే ఆగిపోతే….మీరందరూ నాకంటే పెద్దవాళ్ళయిపోయారు,” అన్నాడు. ఇక రేణుక తన చిన్న కోడలి వైపు చూసి ఆగమన్నట్టు సైగ చేసి రాము వైపు తిరిగి, “రాము….ఇంత కాలం అయిందా….మా దగ్గరకు రావడానికి,” అని అడిగింది. “నేను నీ దగ్గర నుండి నా కాలంలోకి వచ్చిన తరువాత నువ్వు బుక్ లో రాసిన లెటర్లు, ఆల్బమ్ తీసుకుని వెంటనే బయలుదేరాను….ఇక్కడకు వచ్చేటప్పుడు మీరంతా నన్ను గుర్తు పడతారో లేదొ అని ఎంతగా ఆలోచించానో తెలుసా….” అన్నాడు రాము. “అదేంటి రాము అలా అంటావు….నువ్వు వస్తావని నేను, నీ పిల్లలు, నీ మనుమలు ఎంతలా ఎదురుచూస్తున్నామో తెలుసా. రోజు వీళ్ళు నీ గురించి అడుగుతుంటే…..నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తుంటే ఇప్పటికి వచ్చావు,” అంటూ రేణుక తన పిల్లల వైపు చూసి, “చూసారా….వీళ్ళంతా మీ పేరుని ఎంత పాపులర్ చేసారో….కాని మేము చేసుకున్న ప్రతి పండగకు, ప్రతి సంతోషంలోను నువ్వు లేని లోటు మాకు కనిపిస్తూనే ఉన్నది….” అన్నది. “సరె…..జరిగిపోయిన విషాదాన్ని గుర్తు చేసుకుని ఉపయోగం లేదు కదా….ఇప్పుడు నేను వచ్చా కదా….మన పిల్లలు ఏం చేస్తున్నారు…..అని తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నది…..” అన్నాడు రాము. దాంతో రేణుక పిల్లల వైపు చూపిస్తూ, “వీడు మన పెద్ద కొడుకు విశ్వ….ఇప్పుడు చాలా ధనవంతుడు…ఎప్పుడూ చాలా బిజీగా ఉంటాడు….ఇప్పుడు గుడికి రావడానికి కూడా చాలా కష్టపడి ఒప్పించాల్సి వచ్చింది. ఇక మన చిన్న కొడుకు రఘు…ఇక వీడి విషయానికి వస్తే బిజినెస్ తో పాటు భక్తి కూడా ఎక్కువే…..నువ్వు షాపూర్ లో కట్టించిన గుడికి ప్రతి సంత్సరం ఎన్ని పనులు ఉన్నా తప్పకుండా తీసుకెళ్తాడు….ఇక నీ కోడళ్ళ విశయానికి వస్తే పెద్ద కోడలు పద్మ….విశ్వ భార్య….చాలా తెలివైనది….విశ్వాకి బిజినెస్ లో చాలా హెల్ప్ చేస్తుంది….ఈమె చిన్న కోడలు కరుణ రఘుకి భార్య. చిన్న కోడలు…ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూతూనే ఉంటుంది….కాకపోతే పద్మ, కరుణ ఇద్దరూ కొద్దిసేపు అరుచుకుంటారు….అంతలోనే ఒక్కటై పోతారు,” అన్నది. ఆమాట అనగానే అక్కడ అందరూ పద్మ, కరుణల వైపు చూసి గట్టిగా నవ్వారు. పద్మ మెదలకుండా ఉన్నది కాని కరుణ మాత్రం ఉడుక్కుంటూ, “అత్తయ్యా….మామయ్య గారికి మొదట్లోనే నా గురించి అలా చెడుగా చెబితే ఎలా….నన్ను చెడుగా అనుకుంటారు కదా,” అన్నది. దానికి రాము నవ్వుతూ, “లేదులే కరుణ….ఇలా గలగలా మాట్లాడే వాళ్ళు అసలు మనసులో ఏమీ దాచుకోకుండా చాలా మంచిగా ఉంటారు….నీ అమాయకత్వం చూసి నువ్వు ఇక్కడ ఉన్న అందరిలోకి మంచిదానివి అని నాకు బాగా అర్ధమైంది,” అన్నాడు. రాము అలా అనగానే కరుణ ఆనందంగా, “చాలా థాంక్స్ మామయ్య గారు….ఇంత మందిలొ మీరొక్కరే నన్ను చూసిన వెంటనే బాగా అర్ధం చేసుకున్నారు…..ఇక నుండి మీరు నా ఫేవరెట్ మామయ్య గారు….మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగాలి,” అన్నది. రాము కూడా నవ్వుతూ, “అలాగే కరుణ,” అన్నాడు. దానికి రేణుక కూడా నవ్వుతూ, “ఇక చాల్లే కూర్చో….” అంటూ రాము వైపు తిరిగి, “ఇక నీ మనవళ్ళ విషయానికి వస్తే…అచ్చం నీ పోలికలతో పుట్టి….అచ్చు గుద్దినట్టు నీలా ఉన్న వీడి పేరు శివరామ్ కుమార్….వీడు రఘు, కరుణల ఒక్కగానొక్క కొడుకు…అలాగే పిల్లలందరిలో పెద్దవాడు….మొదటి మనవడు…దాదాపు నీ వయసే….అంటే వాడి వయసు కూడా 27 ఏళ్ళు….చాలా తెలివైన వాడు, చురుకైన వాడు. విశ్వ, రఘు తరువాత వీడే బిజినెస్ లు మొత్తం చాలా సమర్ధవంతంగా చూసుకుంటున్నాడు….అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టడు….కోపం ఎక్కువే….కోపం వచ్చిందంటే తన చేతిలో ఉన్నది ఏదైనా సరె నేలకేసి కొట్టేస్తాడు….వాడికి వాడి తమ్ముళ్ళన్నా, చెల్లెకు అన్నా చాలా ఇష్టం….వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వడు. ఇక రెండో మనవడు వినయ్, వీడు విశ్వ పద్మల పెద్ద కొడుకు….మంచి ఆర్టిస్ట్….బిజినెస్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ శిల్పాలు చెక్కుతుఉంటాడు….వీడి చేతిలో మట్టి ముద్ద అద్భుతమైన శిల్పంలా మారుతుంది. ఇక మూడో మనవడు హర్ష కుమార్… పద్మ విశ్వల చిన్న కొడుకు….వీడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు…చాలా అల్లరి వాడు…అమాయకుడు కూడా. మనవరాలు ప్రియ….ఇది డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నది….విశ్వ పద్మల కూతురు,” అని రేణుక ఒక్క నిముషం చెప్పడం ఆపి రాము వైపు చూసి, “ఇక మీ ముద్దుల కూతురు….ఒక్క క్షణమైనా కిందకు దించకుండా ఎత్తుకునే ఉండేవారు కదా….” అని రేణుక తన కూతురు వైపు చూపించి, “దీని పేరు తెలుసుకదా….చాలా ఇష్టపడి పెట్టుకున్నారు….సంజన….ఇంట్లో తన అన్నయ్యలతో పిల్లలతో ఎంత అల్లరి చేస్తుందో….ఆఫీసుకు వెళ్తే అంత హుందాగా ఉంటుంది….” అన్నది. సంజనని చూడగానే రాము ఆమెను దగ్గరకు రమ్మన్నట్టుగా సైగ చేసాడు. దాంతో సంజన సోఫాలో నుండి దాదాపు పరిగెత్తుకుంటున్నట్టుగా రాము దగ్గరకు వచ్చి అతని పక్కనే కూర్చున్నది. రాము ఆమె కళ్ళల్లోకి చూస్తూ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు. అది చూసిన రేణుక, “ఇక కూతురు మీద చూపించిన ప్రేమ చాల్లే….అతను నీ ముద్దుల కూతురి భర్త సంజయ్…అతను కూడా పెద్ద బిజినెస్ మేన్….సంజన ప్రతి ఏడాది ఈ పూజ కోసం రెండు రోజుల ముందు ఇంటికి వస్తుంది….పూజ అయిపోయిన తరువాత తన అత్తారింటికి వెళ్ళిపోతుంది….వీళ్ళిద్దరికీ ఒక అబ్బాయి, అమ్మాయి….ఇద్దరూ చదువుకుంటున్నారు,” అన్నది. రాము సోఫాలో నుండి లేచి తన మనవళ్ళు, మనవరాళ్ళ వైపు ప్రేమగా చూసాడు. శివరాం, వినయ్, హర్ష, ప్రియ, సంజన వాళ్ళ పిల్లలు అందరూ లేచి రాము దగ్గరకు వచ్చి గట్టిగా వాటేసుకున్నారు.